స్టార్ హీరో సల్మాన్ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో అందరికీ తెలిసిందే. క్షణక్షణం భయం గుప్పిట్లో కాలం వెళ్ళదీస్తున్నాడు. 24 గంటలు పోలీసుల పహారా, తన పర్సనల్ సెక్యూరిటీ రక్షణ మధ్య ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా సల్మాన్, బిష్ణోయ్ గ్యాంగ్ మధ్య వార్ జరుగుతోంది. అయితే ఈమధ్యకాలంలో అది కాస్త ఎక్కువైంది. పలుమార్లు బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. కృష్ణ జింకను చంపినందుకు బిష్ణోయ్ తెగకు క్షమాపణ చెప్పకపోతే సల్మాన్‌ని చంపేస్తామని బెదిరిస్తున్నారు. సల్మాన్, బిష్ణోయ్‌ల మధ్య జరుగుతున్న వార్‌లో అమాయకులు బలవుతున్నారు. సల్మాన్ స్నేహితుడు బాబా సిద్ధిఖి హత్యకు గురైన విషయం తెలిసిందే. సల్మాన్ సన్నిహితులను, బంధుమిత్రులను టార్గెట్ చేస్తోంది ఆ గ్యాంగ్.
మొన్నటివరకు బిష్ణోయ్ ఆలయానికి వచ్చి క్షమించమని అడగాలని సల్మాన్‌ని డిమాండ్ చేస్తూ వచ్చిన బిష్ణోయ్ గ్యాంగ్.. ఆ మధ్య రూ.5 కోట్లు ఇస్తే సల్మాన్‌ని వదిలేస్తామని చెప్పడం సంచలనంగా మారింది. దాని తర్వాత ఇటీవల రూ.50 లక్షలు చెల్లించకపోతే సల్మాన్ స్నేహితుడైన షారూక్ ఖాన్‌ను చంపేస్తామని బెదిరింపు వచ్చింది. ఆ కాల్ రాయ్‌పూర్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే.. సల్మాన్, బిష్ణోయ్‌లను లింక్ చేస్తూ ఓ పాట విడుదలైంది. అది బిష్ణోయ్ గ్యాంగ్‌కి ఆగ్రహాన్ని తెప్పించింది. నెలరోజుల వ్యవధిలో ఆ పాట రాసిన వ్యక్తిపై ప్రతీకారం తీరుకుంటామని ఆ గ్యాంగ్ తెలిపింది. సల్మాన్‌కి ధైర్యం ఉంటే అతన్ని రక్షించుకోవాలని ప్రకటించింది. సల్మాన్ సహచర నటుడు షారుఖ్‌ఖాన్‌ను చంపేస్తానని బెదిరించిన కేసుకు సంబంధించిన విచారణలో రాయ్‌పూర్‌కు చెందిన న్యాయవాది ఫైజాన్ ఖాన్ ఫోన్ నుంచి ఆ కాల్ వచ్చిందని పోలీసులు గుర్తించారు. అయితే తన ఫోన్ దొంగతనానికి గురైందని, ఎవరో కావాలనే తన ఫోన్ నుంచి ఆ కాల్ చేశారని వాపోతున్నాడా లాయర్.